వరంగల్ ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ మృతదేహాన్ని కడసారి చూపు కోసం ఇంటికి తీసుకెళ్లారు బంధువులు. ఆ తర్వాత డెడ్ బాడీని చూసిన బంధువులు, స్థానికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ మృతదేహం తమది కాదని తెలుసుకుని.. తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లి మార్చురీ సిబ్బందికి అప్పగించారు. మృతదేహాలు తారుమారు అయినట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే సంబంధిత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
డీటైల్స్ కి వెళ్తే.. హనుమకొండ జిల్లా వంగర మండలానికి చెందిన ఆశాడవు పరమేశ్వర్ (53), ఈ నెల 22న రాత్రి బైక్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
అలాగే జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తానే ధార్ పల్లి గ్రామానికి చెందిన రాగుల రమేష్ (40) ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. చికిత్స పొందుతూ రమేష్ శనివారం మృతి చెందాడు.
వీరిద్దరి మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు సిబ్బంది. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందించారు. రెండు కుటుంబాల వారు మృతదేహాలను తీసుకుని తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత చూసి.. డెడ్ బాడీ తమవారిది కాదని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అనంతరం ఈ సమాచారాన్ని ఎంజీఎం అధికారులకు, పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఆయా గ్రామాల నుంచి ఆంబులెన్సుల్లో మృతదేహాలను వెనక్కి తెప్పించారు. ఆ తర్వాత సంబంధిత డెడ్ బాడీలని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.