పోలీస్ బాస్ చూపిన చొరవకు కృతజ్ఞతలు చాటుకున్నారు వరంగల్ జనం. ఏ అండదండ లేని నిరుపేదలకు చెందిన స్థలాలను ఏనుమాములకు చెందిన దండుపాళ్యం దండు ఆక్రమించుకొని, బాధితులను భయబ్రాంతులకు గురి చేయడమే కాక, భౌతిక దాడులకు తెగబడ్డారు.
సరిగా తినీ, తినక కూడబెట్టుకొన్న డబ్బులతో కొనుగోళ్లు చేసిన భూములను అన్యాక్రాంతం చేయడంతో బాధిత కుటుంబాలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ని శరణు కోరారు. రెక్కాడితే గాని డొక్కాడని నిర్భాగ్యుల భూములను కబ్జా చేసే ప్రయత్నంపై సీపీ సీరియస్ గా స్పందించారు.
ఈస్ట్ జోన్ డీసీపీ పుల్ల కరుణాకర్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ డాక్టర్ జితేందర్ రెడ్డి, మామూనూరు ఏసీపీ కృపాకర్, ఏనుమాముల సీఐ మహేందర్ ల నేతృత్వంలో ఎస్ఓటి పద్ధతిలో సమగ్ర విచారణ చేపట్టారు. దండుపాళ్యం దండు దర్జా దందాల దారుణాలు వెలుగు చూశాయి. దీంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దండుపాళ్యం దండు దురాక్రమాలకు చెక్ పెట్టారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చూపిన చొరవతో తమ భూములు తమకు దక్కడంతో ఆనందోత్సవాలతో సంబరాలు జరుపున్నారు. అందులో భాగంగానే సీపీ ఏవీ రంగనాథ్ ఫ్లెక్సీ క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు బాధితులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.