ఇతరుల సొత్తును దోచుకోవడం అనేది తీవ్రమైన నేరం. దోచుకున్న బంగారాన్ని తిరిగి ఇవ్వడమనేది పశ్చాత్తాపం. మానవత్వానికి మరోరూపం.అయితే దొంగతనం చేసినందుకు దూషించాలో, తిరిగి ఇచ్చినందుకు మొచ్చుకోవాలో తెలియని సందిగ్ధంలో పడేసారు ఆ మనసున్న దొంగలు.
పోలీసులు దొరికిపోతామెమోనన్న భయమో.. పాపభీతో..లేక మరేకారణమో తెలీదు గాని దొంగలించిన మొత్తంలోంచి కొంత బంగారంను తీసుకుని మిగతాదంతా బాధితుల ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు.
ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో వారం రోజుల క్రితం చోరీ జరిగింది. 30 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో డాగ్ స్క్వాడ్ సహాయంతో చోరీ జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈలోపు అనూహ్యంగా పోయిన బంగారం దొరికింది.
దొంగలు బాధితుల ఇంటి ప్రహరీ గోడ వద్ద బంగారం విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోయిన బంగారం దొరికిందని బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కానీ 30 తులాల బంగారం చోరీకి గురైతే.. వచ్చింది మాత్రం 27 తులాలే ఉన్నాయని బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుని మిగిలిన 3 తులాల బంగారాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు.
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో గొలికార్ గోపి తన ముగ్గురు అన్నదమ్ములతో కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే యాదగిరి గుట్టలో తమ దగ్గరి బంధువుల పదోరోజు కార్యక్రమానికి వెళ్లారు.
ఇదే అదనుగా భావించిన దొంగలు శుక్రవారం రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు. మొదట ఇంటిపై కప్పు తొలగించేందుకు యత్నించారు. ఆ తరువాత ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలోని 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.