నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెదురు బావి తండాకు చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు మాతృనాయక్.. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎలాంటి కారణం లేకుండా స్టేషన్ కు తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించాడు. దాహం వేస్తోంది.. తాగడానికి నీళ్లు ఇవ్వమని వేడుకున్నా కనికరం లేకుండా ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్స్ లాఠీలతో ఇష్టానుసారంగా చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు.
హోలీ పండగరోజున తన దారిన తాను వెళ్తుండగా అడ్డగించి.. పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లి కొట్టారని వాపోయాడు. తాను ఎంత బతిమిలాడుతున్నా కరుణించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టీఆర్ఎస్ లో చేరితే రూ. 10 లక్షలు ఇప్పిస్తామన్నారని ఆరోపించాడు. అందుకు తాను నిరాకరిస్తే చంపేస్తామని బెదిరించారని చెప్పాడు.
అవమానం, పోలీసుల దౌర్జన్యం భరించలేక పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు మాతృనాయక్. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు బాధితుని కుటుంబ సభ్యులు.
Advertisements
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితుడికి మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.