ఖలిస్థానీ అనుకూల ‘వారీస్ పంజాబ్ దే’ అధినేతపై పంజాబ్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. ఆయన అరెస్టు సినిమాను తలపించింది. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న అమృత్ సింగ్ పారిపోయాడు.
దీంతో పోలీసులు 100 వాహనాల్లో అతన్ని వెంబడించారు. చివరకు జలంధర్ లోని నాకోదార్ ప్రాంతంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అతని ఆరుగురు అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసం సృష్టించిన కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. బఠిండా జిల్లాలోని జలంధర్-మొగా జాతీయ రహాదారిపై అమృత్‌పాల్ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నాడంటూ పోలీసులకు విశ్వసనీయ సమచారం అందింంది.
దీంతో అతన్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించారు. జలంధర్ దాటగానే అతని కాన్వాయ్ ను పోలీసులు అడ్డగించారు. దీంతో అమృత్‌పాల్ డ్రైవర్ వాహనాన్ని లింక్రోడ్కు మళ్లించారడు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతని వాహనాన్ని వెంబడించారు.
చివరికి అతని వాహనాన్ని చేజ్ చేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో 8 జిల్లాల పోలీసులు పాల్గొన్నారు. ఆపరేషన్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు ఎలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయరాదని పోలీసులు కోరారు. విద్వేష పూరిత ప్రసంగాలు చేయరాదని, హింసాత్మక ఘటనలకు పాల్పడరాదని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గత నెలలో ‘వారీస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు.
అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తల్వార్లు, తుపాకులతో విధ్వంసం సృష్టించారు. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తుఫాన్ ను పోలీసులు అరెస్టు చేసినందుకు వారంతా ఆందోళన చేపట్టారు. స్టేషన్ లోకి దూసుకు వచ్చి పోలీసులపై దాడులు చేశారు.
వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దాడిలో పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో లవ్‌ప్రీత్ తుఫాన్‌ను పోలీసులు విడుదల చేశారు. కానీ తమకు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే లవ్ప్రీత్ను విడుదల చేశామని అమృత్సర్ ఎస్ఎస్పీ వెల్లడించారు.