దేశంలో రానున్న మూడు నెలలు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి జనాలు ఎండలతో అల్లాడే పరిస్థితి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే 31 వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖలో సీనియర్ సైంటిస్ట్ గా పని చేస్తున్న ఎస్.సి. భాన్ తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల వేడి గాలులు వీస్తున్నాయని, విద్యుత్తుకు డిమాండ్ దాదాపు రికార్డు స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు.
ముఖ్యంగా పంటలపై ఈ వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గోధుమ పంట దారుణంగా దెబ్బ తినవచ్చు.. గత ఏడాది మార్చి నెలలో ఇండియా ఎండల దెబ్బకు విలవిలలాడింది. 1901 తరువాత ‘హాటెస్ట్ ఫిబ్రవరి’ ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో చెలరేగిపోయే ఎండలు గోధుమ పంటకు తీవ్ర నష్టం కలిగించవచ్చునని భావిస్తున్నారు.
ఈ పంటను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా తరువాత ఇండియా రెండో అతి పెద్ద దేశం. వాతావరణ మార్పుల్లో కారణంగా ప్రభుత్వం విదేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. వడగాడ్పులు, భారీ వర్షాలు, వరదలు, కరవు పరిస్థితులు ప్రతి ఏడాదీ వేలమంది రైతుల ప్రాణాలను బలిగొంటున్నాయి. పంటలు నాశనమవుతున్నాయి. జల విద్యుత్ వనరులు దెబ్బ తింటున్నాయి. 2015 నుంచి దేశంలో వడగాలుల ప్రభావానికి గురవుతున్న రాష్ట్రాలు 2020 నాటికి 23 కి పెరిగాయి.
ఫిబ్రవరి లో ఉత్తరాది విలవిల
ఉత్తరాది రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెల ఎండలు చురుక్కుమనిపించాయి. 122 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ నెలలో నార్త్ ఇండియా ఎండల ధాటికి భగ్గుమంది.క్లైమేట్ చేంజ్ కారణంగా పలు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రోజువారీ ఉష్ణోగ్రత గరిష్టంగా 1.73 డిగ్రీల సెల్సియస్ కి పైగా పెరిగిందని అంచనా.. దేశంలో అనేక రాష్ట్రాలు భారీ, వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి.