ఈమధ్య ప్రతి సినిమాకు రేట్లు పెంచుకోవడం కామన్ అయిపోయింది. ప్రత్యేకంగా జీవో తెచ్చుకోవడం, రిలీజైన మొదటి వారం రోజులు లేదా 10 రోజులకు రేట్లు పెంచుకోవడం పెద్ద సినిమాలకు అలవాటుగా మారింది. అయితే ఈ ప్లాన్ ను ప్రేక్షకులు తిప్పికొట్టిన విషయాన్ని నిర్మాతలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. బంగారు బాతు లాంటి టాలీవుడ్ మార్కెట్ ను చేజేతులా నాశనం చేసుకుంటున్నామనే విషయాన్ని గ్రహిస్తున్నారు.
అందుకే తాజాగా రాబోతున్న కొన్ని సినిమాలు రేట్లు పెంచడం లేదు. సాధారణ టికెట్ రేట్లకే మొదటి రోజు నుంచి సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఎఫ్3 నుంచి ఇది మొదలుకాబోతోంది. మేజర్ సినిమాకు ఈ పద్ధతి కొనసాగనుంది. అయితే ఇప్పుడీ లిస్ట్ నుంచి వారియర్ సినిమాను పక్కనపెట్టాలనుకుంటున్నారు మేకర్స్.
రామ్ హీరోగా నటిస్తున్న వారియర్ సినిమాకు మొదటి వారం రోజులు టికెట్ రేట్లు పెంచాలని అనుకుంటున్నారట. ఎందుకంటే, ఈ సినిమాకు బడ్జెట్ పెరిగింది. కాబట్టి ఆ మేరకు రిస్క్ తప్పించుకోవాలంటే, మొదటి వారం రోజులు టికెట్ రేట్లు పెంచడం తప్ప, మరో ఆప్షన్ లేదని భావిస్తున్నారట.
ఇదే కనుక జరిగితే, ఆగిపోయిన టికెట్ రేట్ల పెంచు వారియర్ సినిమాతో మరోసారి మొదలైనట్టు అవుతుంది. అయితే ప్రస్తుతం గాసిప్ లెవెల్లో ఉన్న ఈ పుకారు, నిజంగా కార్యరూపం దాలిస్తే, అప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ ఏంటనేది కూడా ఆలోచించాల్సిన విషయం.
ఇప్పటికే థియేటర్లలో ఆక్యుపెన్సీ పడిపోయింది. సర్కారువారి పాట లాంటి సినిమాకే రెండో వారం జనాల్లేరు. ఇలాంటి టైమ్ లో రామ్ వారియర్ సినిమాకు రేట్లు పెంచితే ఆడియన్స్ వస్తారా అనేది అందరి అనుమానం.