దేశ రాజధాని ఢిల్లీలో దారుణాలు ఆగడం లేదు. ఈ ఏడాది మొదటి రోజునే దేశ రాజధాని ఢిల్లీలో హిట్ అండ్ రన్ కేసు జరిగింది. కంఝావాలాలో స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని ఐదుగురు వ్యక్తులు కారుతో ఢీ కొట్లారు. ఆమెను కారుతో సుమారు 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకు వెళ్లారు.
ఈ ఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీలో మరోసారి చోటు చేసుకుంది. రాజౌరి గార్డెన్ ఏరియాలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అటుగా వచ్చిన కారు సైకిల్ ను ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి ఎగిరి కారుపై పడ్డాడు.
కానీ కారును ఆపకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చుకెళ్లారు. ఓ వైపు రోడ్డుపై ట్రాఫిక్ రద్ది ఎక్కువగా ఉన్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని 279, 323, 341, 308 సెక్షన్‌ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.