యూపీలో విగ్రహం నుంచి నీరు వస్తోంది. ప్రయాగ్ రాజ్‌లోని ఓ పార్కులో ఏర్పాటు చేసిన చంద్ర శేఖర్ ఆజాద్ కాంస్య విగ్రహం నుంచి నీటి చుక్కలు ధారగా వస్తున్నాయి. దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలకు అక్కడకు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే?.. ప్రయాగ్ రాజ్ లోని ప్రముఖ చంద్రశేఖర్ ఆజాద్ పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల కొన్ని రోజులుగా ఆ విగ్రహం నుంచి నీటి చుక్కలు కారుతున్నాయి. దీన్ని రజనీకాంత్ అనే వ్యక్తి గమనించి కారుతున్న నీటిని శుభ్రం చేశాడు.
ఆ తర్వాత రోజు కూడా అలాగే నీరు కారడంతో విషయాన్ని గార్డెన్ సూపరింటెండెంట్, జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆయన ఫిర్యాదు చేశాడు. దీంతో విగ్రహానికి మరమ్మతులు ప్రారంభించారు. కానీ విగ్రహం నుంచి నీరు వస్తున్న విషయాన్ని కొంతమంది ఓ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.
ఆ నీటిని నుదిటిపై రాసుకుని అమరుడు దీవిస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఇది సాధారణ ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. విగ్రహానికి ఎక్కడో పగుళ్లు ఏర్పడి ఉండవచ్చని వారు చెబుతున్నారు. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల కూడా విగ్రహానికి పగుళ్లు కూడా ఏర్పడి వుండ వచ్చని నిపుణులు చెబుతున్నారు.