సామాన్యంగా చెట్ల నుంచి చల్లటి గాలి వీస్తుంది.. పువ్వులు పూస్తాయి.. కాయలు కాస్తాయి.. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. ఓ చెట్టు మాత్రం కన్నీటిని కారుస్తోంది. చెట్టు ఏంటి కన్నీరు కార్చడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే.. ఆ వింతను ప్రత్యక్ష్యంగా చూడాలంటే మాత్రం కర్ణాటకలోని కొడగు సమీపంలోని హెరవనాడు అనే గ్రామానికి వెళ్లాల్సిందే.
గత కొన్ని వారాలుగా గ్రామంలోని ఓ బిల్వ పత్ర వృక్షం నీటిని కురిపిస్తోంది. మొదట్లో స్థానికులు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ, రానురాను దీని గురించి ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చెట్ల నుంచి ఆగకుండా నీరు పడటాన్ని కొందరు వర్షం కురుస్తోందని అంటుంటే, మరికొందరు మాత్రం చెట్టు ఏడుస్తోందని అంటున్నారు.
ఎండాకాలం.. మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా చెట్టు నుంచి ఆగకుండా నీళ్లు వస్తూనే ఉన్నాయి. కొమ్మల నుంచి దాదాపు 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నీళ్లు పడుతున్నాయి. ఇలా గత కొన్ని వారాలుగా పడుతూనే ఉన్నాయి. ఇది శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్ర చెట్టని అందుకే నీరు అలా పడుతోందని కొందరు అంటుంటే.. చెట్టుకు 500 మీటర్ల దూరంలో దేవరకాడులో భద్రకాళిదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారి మహిమ వల్లే ఇలా జరుగుతుందని కొందరు అంటున్నారు.
అధికారులు మాత్రం కొన్ని చెట్లకు ఇలా నీరు కార్చే లక్షణాలు ఉంటాయని ఇది కూడా అలాంటి వృక్షమే అని వివరించారు. చెట్టు నుంచి పడుతున్న నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ చెట్టు నుంచి నీరు కారుతుందున్న విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.