రోజురోజుకూ ఎండ తీవ్రతరం అవుతోంది. దీంతో పల్లెల్లో కాదు పట్టణంలోనూ నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. మిషన్ భగీరథ, మున్సిపాలిటీ నీళ్లు రాక ప్రజలు అల్లాడిపోతోన్నారు. ఇళ్ల ముందర ప్లాస్టిక్ డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొన్ని కాలనీలలో తీవ్ర నీటి ఎద్దటి నెలకొంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా అధికారులు తవ్వకాలు చేపట్టారు. పట్టణంలో ఎక్కడికక్కడ నీటి పైపులు పగిలిపోయాయి. వాటికి మరమ్మతులు చేయకపోవడంతో పట్టణానికి సమీపంలో నూతనంగా వెలిసిన నీలా నగర్‌తో పాటు మున్సిపాల్టీలో కొత్తగా విలీనమైన ఆయా గ్రామాలకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.
దీంతో మున్సిపల్ యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే, పూర్తిస్థాయిలో ప్రజలకు నీరు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. అంతేకాదు, ఇళ్ల ముందర ప్లాస్టిక్ డ్రమ్ములతో మున్సిపల్ ట్యాంకర్ల కోసం ఆయా కాలనీల పడిగాపులు కాస్తున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే నీటి తీవ్ర సమస్య నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి పైపులైన్లకు మరమ్మతులు చేసి నీటి ఎద్దడిని నివారించాలని ఆయా కాలనీ వాసులు కోరుతున్నారు.