కాళేశ్వరం నీళ్లతో వేసవిలోనూ చెరువులు నింపుతున్నామంటూ జబ్బలు చరుచుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్ర రాజధానిలో తాగునీటి కటకట గురించి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమ్మర్ స్టార్టింగ్‌లోనే నగరంలో పలు బస్తీవాసులు నీళ్ల కోసం కుస్తీలు పడుతున్నారు. ఇప్పటి నుంచే నల్లాల వద్ద గంటల కొద్ది ఎదురుచూపులు, బిందెలతో కొట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మరీ దారుణంగా ఒక్కో కుటుంబానికి రెండంటే రెండే బిందెల నీళ్లు దొరికే దుస్థితి వచ్చింది.
ప్రధానంగా ఎల్బీనగర్ సెగ్మెంట్‌లోని కొన్ని చోట్ల తాగునీటి కోసం బస్తీవాసులు తండ్లాడుతున్నారు. నాగోల్ సాయినగర్ బస్తీలో 600 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇందులో 40 కుటుంబాలకు కలిపి కేవలం ఒక నల్లానే ఉంది. రెండు రోజులకోసారి గంటసేపు మాత్రమే నీరు వస్తుండటంతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. చుక్క నీరు కిందపోకుండా పట్టుకున్నా.. కుటుంబానికి రెండే బిందెలు దక్కుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మే, జూన్ కల్లా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అని ఆందోళన చెందుతున్నారు.
ఓవైపు ఇక్కడ నీళ్ల కోసం గొడవపడుతోంటే.. ఎల్బీనగర్‌లోనే మరోచోట పైపులు లీక్ కావడంతో నీరంతా వృధాగా పోతోంది. వాస్తు కాలనీ, సిరినగర్ కాలనీల్లోకి అడుగుపెడితే.. వర్షకాలాన్ని తలపించేలా నీటితో నిండిపోయి కనిపిస్తున్నాయి రోడ్లు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు లైట్ తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.