కృష్ణా నీటిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం మొదలైందన్న వాతావరణం కనపడుతోంది. కానీ సీఎం కేసీఆర్, జగన్ లు మంచి మిత్రులు. గత ఎన్నికల నాటి నుండి ఉన్న స్నేహాన్ని కాదని, సీఎం కేసీఆర్ కు తెలియకుండా జగన్ నిర్ణయం తీసుకున్నారా…? ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్, జగన్ లు ఉమ్మడిగా ప్రాజెక్టులు కట్టేందుకు ప్లాన్ చేశారు. బేసిన్ లు లేవు ఏం లేవు… రెండు రాష్ట్రాల ప్రజలకు సాగునీరు ఇచ్చే విధంగా ప్రాజెక్టులు కడుదాం అంటూ గంటల తరబడి చర్చలు జరిపారు. కానీ హఠాత్తుగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి అదనపు లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకునేందుకు సీఎం జగన్ సర్కార్ జీవో విడుదల చేసింది.
ఏపీ సర్కార్ జీవోతో కృష్ణా బేసిన్ లోని కాంగ్రెస్ నేతలు, మేధావులు గగ్గోలు పెట్టడంతో తెలంగాణ సర్కార్ హుటాహుటిన రిటైర్డ్ ఇంజనీర్లు, అధికారులతో భేటీ అయ్యింది. సీఎం కేసీఆర్ ఏపీ సర్కార్ చర్యలను తీవ్రంగా ఖండించారు.
కానీ సీఎం జగన్ కేసీఆర్ కు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చే ప్రధానంగా వినిపిస్తోంది. సాగు నీటి పంపకాల్లో గంటల తరబడి చర్చలు జరిపారని, ఇలాంటి నిర్ణయాలు చర్చకు రాలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు దక్షిణ తెలంగాణ వివక్షకు గురవుతుందన్న నినాదం తెరపైకి వచ్చే క్రమంలోనే కేసీఆర్ ప్రకటన ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక కేసీఆర్ గోదావరి నీటిని కృష్ణా బేసిన్ లోకి తీసుకొస్తున్నారు. గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ కు చేరుకోవటం లాంఛనమే. కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. అక్కడి నుండి నీరు వెళ్లేది కృష్ణా బేసిన్ లోని జిల్లాలకే. దీంతో కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉన్న ఏపీకి కొంత ఎక్కువ నీరు వాడుకునే అవకాశం నీటి యాజమాన్య చట్టాల ప్రకారం వర్తించే అవకాశం ఉంది. అందుకే ఏపీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, కేసీఆర్ కు తెలియకుండా జగన్ నిర్ణయం తీసుకున్నారని అనుకోవటం లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.