పాకిస్తాన్ లో పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఎకానమీ పూర్తిగా క్షీణించింది. ఈ సంక్షోభం ఇంతగా ముదిరిపోతుందనుకోలేదని సాక్షాత్తూ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. శనివారం సియాల్ కోట్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఎంతో నిర్వేదంతో మాట్లాడుతూ.. దివాలా తీసిన దేశంలో జీవిస్తున్నామని, ఈ విషయాన్ని మీరు ఇదివరకే విని ఉంటారని భావిస్తున్నానని అన్నారు. దేశం ఇప్పటికే డిఫాల్టర్ గా మారిపోయింది.. ఇప్పుడు మనమీ దశలో మనుగడ సాగిస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ ఘోర ఆర్ధిక పరిస్థితికి వ్యవస్థ, బ్యూరోక్రసీ, రాజకీయ నాయకులే కారణమని ఆయన ఆరోపించారు.
పాకిస్థాన్ తన సొంత కాళ్ళమీద తాను నిలబడడం చాలా అవసరమన్నారు. మన సమస్యలకు పరిష్కారం మన దేశంలోనే ఉందని, వీటికి పరిష్కారం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ..ఐఎంఎఫ్ వద్ద లేదని ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు. ప్రభుత్వం లోని ఓ సీనియర్ మంత్రే ఇలా దిగాలుగా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి.
ఈ దేశానికి రుణమిచ్చేందుకు ఐఎంఎఫ్ కూడా పలు షరతులు విధించింది. తమకు 1.1 బిలియన్ డాలర్ల రుణమివ్వడానికి ఈ సంస్థ పెట్టిన షరతులకు అంగీకరిస్తున్నామని, అందుకు ప్రజలపై భారీగా పన్నులు విధించేందుకు సిద్ధమని పాక్ ప్రభుత్వం తెలిపింది. ఈ షరతులు ఊహాతీతంగా ఉన్నాయని ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
గత్యంతరం లేక వీటికి అంగీకరించవలసివస్తోందన్నారు. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం ఊహించలేనంతగా పెరిగిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి. . పెట్రోలు లీటర్ ధర 272 రూపాయలయింది. ధరలను నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.