నర్సింహారెడ్డి
జర్నలిస్ట్
నా మిత్రుడు ఒకరు రాత్రి నాకు ఫోన్ చేశాడు. ఒక సందేహం ఉంది తిరుస్తావా అన్నాడు. సరే అడుగు అన్నాను. మీడియా వాళ్లను సీఎం తన ప్రెస్ మీట్ కు పిలుస్తారా లేక మీరే వెళ్తారా అని అడిగాడు. లేదు మాకు సీఎంఓ నుంచి msg రూపంలో ఇన్విటేషన్ వస్తది అప్పుడు వెళ్తాము అని సమాధానం చెపుతూనే.. ఆ అనుమానం నీకెందుకు వచ్చింది అని ఎదురు ప్రశ్న వేసాను. ప్రతి ప్రెస్ మీట్ లో మీ రిపోర్టర్స్ కేవలం సీఎం తో తిట్లు తినడానికే వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా మిమ్మల్ని తిట్టడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. మా ఊర్లలో ఉండే రిపోర్టర్స్ ఎవరైనా లీడర్ ఏదైనా చికాకు పడ్డ గొడవ పెట్టుకొని లేచి వెళ్ళిపోతారు. మా ఏరియా రిపోర్టర్ లకు ముక్కు మీద కోపం ఉంటది. మీరు మాత్రం సీఎం ఎన్నిసార్లు తిట్టినా అక్కడే ఉంటారు. లేచి బయటకు రారు ఎందుకు అని ప్రశ్నించాడు. గ్రామాల్లో మేము అయితే మిమ్మల్ని సీఎం తిడుతుంటే మస్త్ నవ్వుతున్నాం. సీఎం గంట సేపు సీరియస్ గా మాట్లాడి చివరిలో మిమ్మల్ని తిడుతున్నది చూస్తే నవ్వువస్తుంది, వీళ్లు తిట్లు తినడానికి అక్కడిదాక వెళ్లాలా అని మేము జోక్ లు వేసుకుంటున్నాం అని అతను అంటుంటే మా పరిస్థితి ఇంతగా దిగజారిందా అనే బాధ కలిగింది.. సీఎం గారు మేము మీ ఇంట్లో జీతగాళ్ళం అనుకున్నారా అని ప్రశ్నించాలని అనిపించింది.
ఒకప్పుడు ప్రెస్ మీట్ కు 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే నేతలు జర్నలిస్ట్ లకు క్షమాపణలు చెప్పేవాళ్ళు. మీడియా వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతారో అనే భయం నేతల్లో ఉండేది. జర్నలిస్ట్ లు అడిగే ప్రశ్నలు అన్నింటికీ దాదాపుగా సమాధానం చెప్పేవాళ్ళు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో టిఆర్ఎస్ మినహా మిగతా పార్టీ నేతల విషయంలో మా మిత్రుల తీరు కాస్త వివాదాస్పదం అయినా అంతటి స్వేచ్ఛ ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ప్రెస్ మీట్ కు వచ్చిన రిపోర్టర్స్ను గంటల పాటు వెయిట్ చేయిస్తున్నారు. చెప్పిన టైమ్ కు రావడమే నేతలు మానేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జర్నలిస్ట్ ల హక్కులు పూర్తిగా హరించుకుపోయాయి. ప్రెస్ మీట్ కు సీఎం ఆఫీస్ ఆహ్వానిస్తేనే వెళ్తాము, సీఎం కు మాట్లాడే హక్కు ఎంత ఉందో మాకు ప్రజల పక్షాన అడిగే హక్కు అంతే ఉంది. ముఖ్యమంత్రి కి సమాధానం చెప్పే ఇష్టం ఉంటే చెప్పాలి లేదా సమాధానం చెప్పను అని చెప్పాలి అంతే గాని తిట్టడం ఏంటి, మీకు ఎంత హక్కు ఉందొ మాకు అంతే హక్కు ఉంది. అందుకే జర్నలిస్ట్ అంటే మీ ఇంట్లో జ జీతగాళ్లం అనుకుంటున్నారా అని సీఎం ను గట్టిగా నిలదీయాలని ఉంది.
మా కుటుంబాలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, మాకు జీతాలు సకాలంలో రాకపోయినా మా వృత్తి ధర్మాన్ని మేము నిర్వహిస్తున్నాం. ప్రజలు ఏ కష్టాల్లో ఉన్న మా వంతుగా వాళ్లకు సర్వీస్ చేస్తున్నాం. కరోనా విషయంలో నే తీసుకోండి మీ ప్రభుత్వ ఉద్యోగులకు ధీటుగా, ప్రాణాలకు తెగించి సమాజానికి వార్తలను చేరవేసాం, అందరూ ప్రచారం చేసుకున్నారు మేము కష్ట పడుతున్నాం అని కానీ మేము ఎక్కడ ప్రచారానికి ఎగబడలేదు. నాలుగో స్తంభం గా నిలబడి సమాజానికి సేవ చేసాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని తిట్టి మళ్ళీ ప్రచారానికి మాదగ్గరకే వస్తారు.. అందుకే సీఎం గారు మేము మీ ఇంట్లో జీతగాళ్ళం అనుకున్నారా అని అడగాలని ఉంది.
మన వస్తువు మంచిదైతే కంసాలి తప్పేముంది అన్న సామెత మా జర్నలిస్ట్ మిత్రులకు సరిగ్గా సరిపోతుంది. ఏదైనా జర్నలిస్ట్ పై దాడి జరిగినా, అవమానం జరిగినా ఉమ్మడి రాష్ర్రంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ముందు చాలా ధర్నాలు ర్యాలీలు జరిగేవి. ప్రెస్ మీట్ కు లీడర్ ఆలస్యంగా వచ్చినా, సమాధానం చెప్పక పోయినా బాయికట్ చేసి వెళ్లిపోయే వాళ్ళు. కానీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎంతలా అంటే ఒక ఎంపీ తో ఫోటో కోసం క్యూ లో నిలబడే స్థాయికి వచ్చింది, దిగిన ఫోటోను వాట్సప్ డీపీల్లో పెట్టుకోవడానికి పోటీ పడే స్థాయికి. ప్రశ్నించడం అంటే ఓన్లీ ప్రతిపక్షాన్ని మాత్రమే అనే స్థాయికి వచ్చింది. అధికార పార్టీ, ముఖ్యమంత్రి ఏది చెప్పినా అదే వేదం అనే స్థాయికి వచ్చింది.. అక్కడక్కడా మిగిలిపోయిన నిజమైన జర్నలిస్ట్ లను సీఎం తిడుతుంటే నవ్వే స్థాయికి వచ్చింది. ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి సీఎం ఏది చెప్పినా మహా అద్భుతం అని చెప్పే స్థాయికి వచ్చింది. ప్రజల పక్షాన ప్రశ్నించడం, హక్కులకోసం పోరాడటం మర్చిపోయే స్థాయికి వచ్చింది. ఆఫీస్ నుంచి బయల్దేరే ముందే ఈరోజు ప్రభుత్వాన్ని ఏ ప్రతిపక్ష నేత ప్రశ్నించినా అతన్ని మన ప్రశ్నలతో చీల్చి చెండాడాలి అనుకునే జర్నలిస్ట్ కాకుండా ప్రశ్నించే తత్వం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేతల దగ్గర చేతులు చాచకుండా విలువైన జర్నలిజం తో పనిచేస్తున్న జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు వాళ్లకు గౌరవం ఇవ్వాలి. అందుకే సీఎం ను అడుగుతున్న… మీ ఇంట్లో జీతగాళ్ళం అనుకుంటున్నారా.
మీడియా చాలా వరకు కార్పొరేట్ల చేతిలో ఉండడం, ఆ కార్పొరేట్ల జుట్లు ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల కూడా జర్నలిస్ట్ లకు గౌరవం లేకుండా పోతున్నది. ఏది ఏమైనా జర్నలిస్ట్ లము సమాజం కోసం పనిచేస్తున్నాం, ఉద్యోగ భద్రత లేకపోయినా, ప్రభుత్వం నుంచి సహాయం అందకపోయినా మా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాం. అందుకే సీఎం గారికి ఇప్పుడు గట్టిగా చెప్తున్నా మేము మీ ఇంట్లో జీతగాళ్ళం కాదు అని.