– ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
– పార్టీ నేతలకు కేటీఆర్ హెచ్చరిక
– కీలక సమయం ఆసన్నమైందని సూచన
– చిన్నసారు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
– మోడీ సర్కార్ కు కూడా సవాల్
– ముందస్తుకు సిద్ధం..
– దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయాలని ఛాలెంజ్
– కేటీఆర్ వ్యాఖ్యలతో పెరిగిన హీట్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా? లేక.. రైట్ టైమ్ కే వస్తారా? అనే దానిపై క్లారిటీ లేకపోయినా.. ప్రతిపక్షాలు మాత్రం ముందస్తు పక్కా అని చెబుతూ వస్తున్నాయి. అయితే.. నిజామాబాద్ టూర్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల అనుమానాలకు బలాన్నిస్తున్నాయి
నిజామాబాద్ పర్యటన సందర్భంగా కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలను హెచ్చరించారు. ఎలక్షన్ ఏ సందర్భంలో వచ్చినా రెడీగా ఉండాలని సూచించారు. ఇది కీలక సమయమని.. నిర్విరామంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు కేటీఆర్. ముందస్తుకు వెళ్తే.. తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. దమ్ముంటే లోక్ సభను రద్దు చేసి రావాలని ఛాలెంజ్ చేశారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని.. బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు.
కేసీఆర్ ఈసారి కూడా ముందస్తుకు వెళ్తారనే ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి అయితే.. ఫిబ్రవరి చివరిలోనే అసెంబ్లీ రద్దు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కూడా ముందస్తుకు వెళ్తే అవకాశం ఉందన్నారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాళ్లు అన్నట్టే ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఎన్నికలపై ముదస్తుగానే నేతలను ప్రిపేర్ చేసుకుని ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నదే గులాబీ బాస్ వ్యూహంగా అంచనా వేస్తున్నారు. అందుకే.. కేటీఆర్ అలా మాట్లాడి ఉంటారని చెబుతున్నారు.
తాము మాత్రం ముందస్తుకు వెళ్లేది లేదని కొద్ది రోజుల క్రితం కిషన్ రెడ్డి అన్నారు. కానీ, కేటీఆర్ మేం రెడీ మీరు రెడీనా అంటూ సవాల్ విసిరారు. మొత్తానికి చిన్నసారు వ్యాఖ్యలు అనుమానాస్పదంగానే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.