దేశ స్వాతంత్య్రం కోసం దివంగత సావర్కర్ చేసిన త్యాగ నిరతిని ఎవరూ కాదనలేరని, కానీ ఆయనపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలను దేశ సమస్యగా చేయజాలమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. నేడు ఇంకా ఎన్నో అంశాలు దేశాన్ని చుట్టుముట్టి ఉన్నాయని ఆయన చెప్పారు. సావర్కర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తూ… విదేశాల్లో ఉండగా ఓ భారతీయుడు దేశ సమస్యల గురించి ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదని పేర్కొన్నారు. నాగపూర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ రోజున సావర్కర్ అన్నది జాతీయ అంశం కాదని , ఇది పాతబడిపోయిన సమస్య అని చెప్పారు.
సావర్కర్ పై తాము కొన్ని విషయాలు చెప్పినా అవి వ్యక్తిగతమైనవన్నారు. ఇది హిందూ మహాసభకు వ్యతిరేకమని.. కానీ దీనికి మరోవైపున ఓ కోణం కూడా ఉందని పవార్ వ్యాఖ్యానించారు. ‘సుమారు 32 ఏళ్ళ క్రితం నేను పార్లమెంట్ లో సావర్కర్ అభ్యుదయ భావాల గురించి చెప్పాను.. రత్నగిరిలో ఆయన ఓ ఇంటిని, దానికి ఎదురుగానే ఆలయాన్ని కూడా నిర్మించాడు.. ఆ గుడిలో పూజలు నిర్వహించాలని వాల్మీకి తెగకు చెందిన వ్యక్తిని కోరాడు.. ఇది ఆ నాడే ఎంతో అభ్యుదయ భావనగా నేను తలిచాను’ అని పవార్ వివరించారు.
ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలున్నందున ఇక సావర్కర్ అంశాన్ని జాతీయ స్థాయిలోకి తేవలసిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ.. ప్రతివ్యక్తి మాదిరే రాహుల్ కి కూడా తన అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ ఉందన్నారు.
విదేశీ గడ్డపై ఇండియా గురించి ఒక నేత వ్యాఖ్యానించడంతో తప్పు లేదని పవార్ అన్నారు. బీజేపీ ఈ అంశాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణిస్తోందో అర్థం కావడంలేదని ఆయన చెప్పారు,. 2024 లో లోక్ సభ, మహారాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు పవార్.. ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు.