ప్రధాని మోడీ నుంచి వ్యక్తిగతంగా ఎవరూ సాయం పొందలేరని ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తెలిపారు. క్రోనీ కేపిటలిస్టులకు మాత్రమే మోడీ ప్రభుత్వం సాయపడుతుందని విపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. తనకేదో ఈ సర్కార్ నుంచి వ్యక్తిగతంగా సహాయం లభిస్తుందన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తాను కొన్ని విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతోనూ పని చేస్తున్నానన్నారు.
మోడీతో ఎవరైనా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన పాలసీలపై మాట్లాడవచ్చునని, ఒకపాలసీ అంటూ అమల్లోకి వచ్చాక అది అందరికీ సంబంధించినది అవుతుందే తప్ప.. కేవలం ఒక్క అదానీ గ్రూపునకు మాత్రమే కాదని అయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 22 రాష్ట్రాలతో కలిసి నేను పని చేస్తున్నాను.. వీటిలో బీజేపీ అధికారంలో లేని కొన్ని ఇతర పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కేరళ, ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటివి కూడా ఉన్నాయి అని అదానీ వెల్లడించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ తనకెలాంటి సమస్య లేదని ఆయన చెప్పారు.
ప్రతి రాష్ట్రంలోనూ సాధ్యమైనంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలన్నదే తన ఉద్దేశమని ఆయన వెల్లడించారు. తన జర్నీ మూడు దశాబ్దాల క్రితమే.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాం నుంచే ప్రయాణమైందని ఆయన ఇటీవల తెలిపారు. అంతే తప్ప..వృత్తిగతంగా తాను సాధించిన అభివృద్ధిని ఎవరో ఒక పొలిటికల్ లీడర్ తో ముడి పెట్టడం తగదన్నారు. మోడీ, తాను ఒకే రాష్ట్రానికి చెందినవారిమైనందువల్లే కొన్ని పార్టీలు సులువుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని అదానీ విచారం వ్యక్తం చేశారు
గత ఏడెనిమిదేళ్లలో తమ ఆదాయం 24 శాతం పెరిగినప్పటికీ తమ రుణాలు కూడా 11 శాతం పెరిగాయని అదానీ చెప్పారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ పట్ల చేస్తున్న ఆరోపణలను ఆయన ‘బిజినెస్ ఆఫ్ పాలిటిక్స్’ లో భాగంగా తోసిపుచ్చారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ మాటేమిటి అని ప్రశ్నించారు. ‘ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆహ్వానంపై నేను అక్కడ జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనడానికి వెళ్ళాను.. ఆ తరువాత ఆ రాష్ట్రంలో మా పెట్టుబడుల విషయమై రాహుల్ సైతం ప్రశంసించారు’ అని ఆయన వివరించారు. రాజస్థాన్ లో అదానీ గ్రూప్ 68 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది.