సర్జికల్ దాడులపై తమ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తాము అంగీకరించబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అవి ఆయన సొంత అభిప్రాయాలని, ఒకవిధంగా వాస్తవానికి దూరంగా ఉంటాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. మన సాయుధ దళాలు ఎంతో ధైర్య సాహసాలతో తమ విధులు నిర్వహిస్తున్నాయని, వాటిని నిరూపించుకోవల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 2019 లో జరిగిన సర్జికల్ దాడులు నిజం కాదన్నట్టు దిగ్విజయ్ సింగ్ నిన్న జమ్మూ కశ్మీర్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా జరిగిన సభలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అబధ్ధాలు చెబుతోందని ఆరోపించారు.
ఆ దాడులకు సంబంధించిన ఆధారాలను కేంద్రం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆ స్ట్రైక్స్ లో చాలామంది మరణించారని చెబుతున్నారని, కానీ అందుకు ఆధారాలేవని అన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, అది తమ పార్టీ అభిప్రాయం కాదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
2014 కి ముందు యూపీఏ ప్రభుత్వం కూడా సర్జికల్ దాడులను నిర్వహించిందని, దేశ ప్రయోజనాలకోసం సాయుధ దళాల అన్ని చర్యలకు మద్దతునిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ కి తాము దూరమని పార్టీ వెల్లడించింది.
ఇక దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇవి బాధ్యతారాహిత్యమైనవని దుయ్యబట్టారు. సైన్యాన్ని కించపరిస్తే భారత్ సహించజాలదని వారన్నారు. ఏమైనా… తమ పార్టీ నేత వెలిబుచ్చిన అభిప్రాయాలపై రాహుల్ గాంధీ మంగళవారం మొదటిసారిగా స్పందించడం విశేషం.