హీరో ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ కి వస్తున్న ఆటంకాలు అన్నీఇన్నీ కావు.. ఈ సినిమాలోని పాత్రల చిత్రీకరణ, క్యారక్టర్ల వేషాలపై ఇప్పటికే ట్రోలింగులు, వివాదాలు వెల్లువెత్తుతుండగా మహారాష్ట్రలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనివ్వబోమని బీజేపీ హెచ్చరించింది. ఈ పార్టీ నేత రామ్ కదమ్ ..గురువారం ఈ సినిమాపై ఇంతెత్తున ఆగ్రహం ప్రకటించారు. ‘ఆదిపురుష్’ మూవీ మేకర్స్ మళ్ళీ కోట్లాది హిందువుల విశ్వాసాన్ని, మనోభావాలను గాయపరిచారని ఆయన ఆరోపించారు.
చీప్ పబ్లిసిటీ కోసం దేవుళ్ళు, దేవతలను ఇందులో కించపరిచే విధంగా చూపారని అన్నారు. కేవలం క్షమాపణ చెబితేనో , కొన్ని సీన్లు తొలగించామని నచ్చజెప్ప జూస్తేనో చాలదని, ఈ సినిమా మేకర్స్ కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలను పూర్తిగా బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘హిందూ దేవుళ్ళు, దేవతలను ఇందులో వక్రీకరించి చూపారు.. కొందరు చిత్ర నిర్మాతలు పబ్లిసిటీ కోసం, డబ్బులకోసం ఇలా వాస్తవాలను వక్రీకరించడానికి చూస్తారు. ఇది వాళ్లకు అలవాటుగా మారింది. హిందూ సమాజం ఇలాంటివాటిని హర్షించదు.’ అని ఆయన అన్నారు.
ఈ మూవీని నిషేధించడమే కాక.. చిత్ర రంగం నుంచి ఈ సినిమా నిర్మాతను బ్యాన్ చేయడానికి ఏదైనా నిబంధనవంటిది ఉండాలని రామ్ కదమ్ అభిప్రాయపడ్డారు.అప్పుడే కొంతకాలం అనుమతించకుండా చూడవచ్చునని, భవిష్యత్తులో కాస్త ముందు చూపుతో వ్యవహరించే విషయాన్ని పరిశీలిస్తారని ఆయన ట్వీట్ చేశారు. ఆదిపురుష్ చిత్రంలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా.. చిత్ర దర్శకుడు ఓం రౌత్ కి రాసిన లేఖలో కోరారు. ముఖ్యంగా హనుమంతుని పాత్ర చిత్రీకరణ దారుణంగా ఉందన్నారు.
బీజేపీకే చెందిన మరో నేత సాక్షిమహారాజ్ సైతం ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతిని ఈ సినిమా మేకర్స్ మంటగలిపారని ఆయన ధ్వజమెత్తారు.