పాక్ మంత్రి హీనా రబ్బానీ కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ మధ్య ఉన్న వివాదంలో భారత్ వైపు నుంచే సమస్య ఉందన్నారు. అక్కడ రాజనీతిజ్ఞత కొరవడిందన్నారు. భారత్ ప్రధాని నరేంద్రమోడీ సొంత దేశానికి మంచే కావచ్చు, కానీ ఆయన్ని పాక్ భాగస్వామిగా చూడటం లేదన్నారు.
భారత్, పాక్ దేశాల మధ్య శాంతి ప్రయత్నాల కోసం కలిసి పనిచేసేందుకు భారత ప్రధాన మోడీని తమ దేశం ఒక భాగస్వామిగా చూడటం లేదన్నారు. మోడీకి ముందు ప్రధాన మంత్రులుగా ఉన్న మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయిలను మాత్రమే తమ దేశం భాగస్వాములుగా చూసిందన్నారు.
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశంలో దక్షిణాసియా సెషన్‌లో ఆమె మాట్లాడారు. తాను పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసినప్పుడు భారత్‌కు వెళ్లానన్నారు. ఇరుదేశాల మధ్య శాంతి, సమన్వయం కోసం పనిచేశానన్నారు. 2023తో పోలిస్తే గతంలోని వాతావరణమే బాగుండేదన్నారు.
ఈ మూడేండ్లలో మనం చేసిందేమిటి? అని ఆమె ప్రశ్నించారు. కేవలం శత్రుత్వం పెంచుకుంటూ వచ్చామన్నారు. భౌగోళికతను మనం మార్చలేమనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇది కేవలం దక్షిణాసియా సమస్య మాతరమే కాదన్నారు. ప్రతి విషయాన్ని ఎన్నికల కోణంలో చూడవద్దన్నారు.
శాంతి కోసం ఆలోచించాలని భారత్‌కు ఆమె సూచించారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలని పాక్ కోరుకుంటోందన్నారు. భారత్‌లో ఒకప్పుడు అన్ని మతాల వారు కలిసి సహజీవనం చేసేవారని పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగేలా కనిపించడం లేదన్నారు.
అలాగని తమ దేశంలో ఎలాంటి సమస్యలు లేవని తాను చెప్పడం లేదన్నారు. కానీ మైనారిటీల రక్షణకు తమ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలతో పాటు కొత్త చట్టాలను తీసుకువచ్చి మైనారిటీలకు రక్షణ కల్పిసున్నామన్నారు.
భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాఠాలు నేర్చుకున్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఇటీవల అన్నారు. పొరుగు దేశం (భారత్)తో తాము శాంతిని కోరుకుంటున్నామన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హినా రబ్బానీ తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.