వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఒంటరిగానే ఓడిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ శుక్రవారం స్పష్టం చేశారు. టీడీపీతో పోత్తు పెట్టుకోవాలని తెలంగాణ బీజేపీ ఆలోచన చేస్తోందంటూ ఓ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు.
ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన తరుణ్ చుగ్.. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, వైఎస్ షర్మిలకు అండగా నిలవాలని టీ బీజేపీ భావిస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు. పార్టీకి దురుద్దేశాలు ఆపాదించాలనే కుట్రతోనే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న ఢిల్లీలో కొద్ది మంది మీడియా ప్రతినిధులు, స్నేహితులతో జరిగిన అనధికారిక సమావేశంలో టీడీపీతో పొత్తు, షర్మిలకు మద్దతు ఇవ్వడం వంటి విషయాలపై తాను ప్రస్తావించలేదని అన్నారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ పై అసత్య ప్రచారాలు చేస్తూ పొత్తుల కోసం అర్రులు చాస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ను ఒంటరిగానే ఓడించే బలం బీజేపీకి ఉందని, అధికార పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నానన్నారు. ఈ తరహా ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు తరుణ్ చుగ్.