భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాల సరఫరా, సైనిక హార్డ్ వేర్ కోసం విదేశాలపై ఆధారపడకూడదని ఉక్రెయిన్ యుద్ధం నుంచి భారత బలగాలు పాఠాలు నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైసినా డైలాగ్‌లో ఇంటరాక్టివ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
రక్షణ వ్యవస్థలో స్వావలంబన తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో కీలక ప్లాట్ ఫారమ్స్, పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతోందన్నారు. ఉక్రెయిన్ యుద్దం ప్రపంచ దేశాల ముందు పలు ప్రశ్నలను విసిరిందన్నారు.
ముఖ్యంగా దేశాలు స్వల్పకాలిక యుద్ధాల కోసం సామర్థ్యాలను పెంపొందించుకోవాలా లేదా సుదీర్ఘ కాలం కోసం సిద్ధం కావాలా అనే ప్రశ్నను ఉక్రెయిన్ యుద్ధం తెరపైకి తెచ్చిందన్నారు. భారత్ విషయానికి వస్తే భవిష్యత్తులో మనం ఎలాంటి సవాలును ఎదుర్కొంటామో చూడాలన్నారు.
యూరప్‌లో జరుగుతున్నట్లుగా సుదీర్ఘమైన వివాదం జరగబోతోందని తాము భావించడం లేదని ఆయన అన్నారు. రక్షణ వ్యవస్థలో మనం స్వావలంబన కలిగి ఉండాలన్నారు. ఉక్రెయిన్ యుద్ధం నుంచి మనం నేర్చుకునే అతి పెద్ద పాఠం అదేనన్నారు. బయటి దేశాల ఆయుధాల సరఫరాపై మనం ఆధారపడలేమన్నారు.
ఈ ఆధునిక యుగంలో యుద్ధాలు చాలా చిన్నగా, వేగవంతంగా ఉండబోతున్నాయనే అభిప్రాయం ఉందన్నారు. కానీ ఇప్పుడు మనం సుదీర్ఘ యుద్ధాలను చూస్తున్నామన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, మనం విజయవంతం కావడానికి ఆ సేవలు చోదక శక్తిగా నిలుస్తాయని అన్నారు.