1975లో దేశంలో ఎమర్జెన్సి సమయంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగాయని ప్రధాని మోడీ అన్నారు. మన్ కీ బాత్ 90 ఎపిసోడ్ లో భాగంగా జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ…. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజా హక్కులను అప్పటి ప్రభుత్వాలు హరించాయని ప్రధాని చెప్పారు.
వాటిలో వ్యక్తిగత స్వతంత్ర్య హక్కు, జీవించే హక్కులను కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సమయంలో పత్రికల మీద కఠినమైన సెన్సార్ షిప్ ను ప్రభుత్వం విధించిందన్నారు. ప్రభుత్వ అనుమతి లేనిదే అసలు ఏ వార్త పబ్లిష్ కాలేదని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ పాటలు పాడటానికి ప్రముఖ సింగర్ కిషోర్ కుమార్ తిరస్కరించారని, దీంతో ఆయనపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కిషోర్ కుమార్ ను కనీసం రేడియోలో మాట్లాడటానికి కూడా అప్పుడు అనుమతించలేదని చెప్పుకొచ్చారు.
దేశ ప్రజలు ప్రజాస్వామ్య పద్దతుల్లో పోరాటాలు చేసి ఎమర్జెన్సీ రద్దు చేయడంలో విజయం సాధించారని వివరించారు. తద్వారా దేశంలో మరోసారి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు పునరుద్దరించేలా చేశారని పేర్కొన్నారు. శతాబ్దాలుగా మనలో పాతుకుపోయిన ప్రజాస్వామ్య విలువలు, మన సిరల్లో ప్రవహించే ప్రజాస్వామ్య స్ఫూర్తి, చివరికి విజయం సాధించిందని ఆయన వెల్లడించారు.