ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధించడంపై అమెరికా పరోక్షంగా విమర్శించింది. ఇది ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించినదని, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య సూత్రాల ప్రాధాన్యాన్ని హైలైట్ చేయవలసిన తరుణం ఇదేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఇండియా తో సహా ప్రపంచ దేశాల్లో ఇవి అమలు కావాలని ఆయన చెప్పారు.
పత్రికా స్వేచ్ఛను తాము సమర్థిస్తామని, అలాగే మత స్వేచ్ఛ, లేదా విశ్వాసాలు, మానవహక్కుల పరిరక్షణ వంటివి మన ప్రజాస్వామ్య సూత్రాలను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు మాకున్న సంబంధాల నేపథ్యంలో ఇదే స్పష్టం చేయదలుచుకున్నాను అని నెడ్ ప్రైస్ తెలిపారు. ఇది ఇండియాకు కూడా వర్తిస్తుందన్నారు.
మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని తాను చూడలేదని అంతకుముందు ఆయన చెప్పారు. అయితే అమెరికాకు సంబంధించి నైతిక విలువల గురించి తనకు తెలుసునన్నారు. భారత, అమెరికా దేశాలు రెండూ గొప్ప ప్రజాస్వామిక దేశాలని, ఇండియాలో ఆ ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఆయా సందర్భాల్లో తాము సమర్థిస్తూ వచ్చామన్నారు.
2002 లో గుజరాత్ సీఎంగా మోడీ ఉండగా జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీని నిర్మించింది. అయితే ఇది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందంటూ ఇండియాలో దీన్ని కేంద్రం నిషేధించింది. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. కేరళ వంటి రాష్ట్రాల్లో విపక్షాల యువజన సంస్థలు ఈ బ్యాన్ ని అతిక్రమించి ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాయి. ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు దీన్ని ప్రదర్శించబోగా అధికారులు అడ్డుకున్నారు.