రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని వణికిస్తోంది. రష్యా చేస్తున్న బాంబుల దాడిలో ఉక్రెయిన్ మండేకొలిమిలా మారింది. దీంతో ఉక్రెయిన్ ప్రజలతో పాటు.. భారతీయులు సైతం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్ధులు దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలించి.. అక్కడి నుంచి భారత్ కు తీసుకురావాలని భావిస్తున్నారు.
అక్కడ విద్యనభ్యసిస్తున్న తెలుగు విద్యార్ధులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డ కట్టే చలిలో.. మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలోనే సుమారు 30 కిలో మీటర్లు నడిచిన తర్వాత బస్సు సదుపాయం లభించిందని అంటున్నారు లీవూలో ఉంటూ వైద్య విద్యనభ్యసిస్తున్న వంకాయల విష్ణు వర్థన్. రవాణా సదుపాయాలు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామంటున్నారు.
నడుచుకుంటూ పోలాండ్ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నామని.. అక్కడ భారతీయులు ఎక్కువగా ఉండటంతో మరో సరిహద్దు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించమని సూచించారని చెప్తున్నారు. నడవలేని పరిస్థితుల్లో క్యాబ్ లను ఆశ్రయిస్తే అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. దీంతో మళ్లీ కొన్ని కిలో మీటర్లు నడుచుకుంటూ పోలాండ్ కు 10కిలో మీటర్ల దూరంలో ఆగామంటున్నారు. తమతో పాటు మహిళలూ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తోందని వార్తలు వస్తున్నప్పటి నుంచే కళాశాల నుంచి వెళ్లిపోతామని యాజమాన్యాన్ని కోరామని.. మొదట అంగీకరించలేదంటున్నారు విష్ణు వర్థన్. కానీ.. యుద్ధం మొదలైన తర్వాత సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారని అన్నారు. రష్యా సైనిక చర్య ప్రారంభించిన నాటి నుంచే మాకు ఇబ్బందులు మొదలయ్యాయని వాపోయారు. దాదాపు దుకాణాలన్నింటినీ మూసివేశారు.
తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామంటున్నారు. ఇండియన్ ఎంబసీ వాళ్లు వీలైనంత త్వరగా పోలాండ్ కు తీసుకెళ్తామని చెప్పారని అంటున్నారు. అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్ కు తరలిస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. వీలైనంత త్వరగా తమకు సాయం అందించేలా చర్యలు చేపట్టి.. భారత్ కు తీసుకెళ్లే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు విష్ణు.