లండన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. ఇండియా ప్రతిష్టను దిగజార్చడానికి మీరు అక్కడ యత్నించారని, కానీ మోడీ ఇక్కడున్నంతవరకు మీరు ప్రధాని కావడం కల్ల అని అన్నారు. కర్ణాటక లోని కనకగిరిలో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో పాల్గొన్న శర్మ.. మాకిక బాబరీ మసీదు అవసరం లేదని, మాకు రామజన్మ భూమి కావాలని చెప్పారు.
ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో పాలక, విపక్షాల మధ్య పెద్దఎత్తున రభస జరిగిన నేపథ్యంలో .. హిమంత శర్మ.. రాహుల్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై రాహుల్ భారత పార్లమెంటు ప్రతిష్టను మంట గలిపారని, కానీ మోడీ ఎక్కడికి వెళ్లినా తమ మాతృభూమిని ప్రశంసిస్తుంటారని ఆయన అన్నారు.
కర్ణాటకతో బాటు ఈ దేశాభివృద్ధికి మోడీ నిరంతరం కృషిని కొనసాగిస్తున్నారని, లండన్ వెళ్లినా, అమెరికా వెళ్లినా ఈ దేశాన్ని ఆయన పొగుడుతుంటారని శర్మ పేర్కొన్నారు. కానీ మీరు లండన్ వెళ్ళగానే ఇండియాను. ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడారని ఆయన ఆరోపించారు. ‘భారత్ జోడో యాత్ర అంటూ మీరు కర్ణాటకకు వచ్చారు. కానీ లండన్ వెళ్ళగానే ‘భారత్ తోడో’ అంటూ బొబ్బలు చరిస్త్తున్నారు’ అని హిమంత.. రాహుల్ పై మండిపడ్డారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తిరిగి బీజేపీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. మోడీని మూడోసారి ప్రధానిని చేయాల్సి ఉందన్నారు. మోడీ నాయకత్వం కింద ఇండియా ‘విశ్వగురు’ గా మారుతుందన్నారు.