క్రిమినల్ డిఫమేషన్ కేసులో తమ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షవిధించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది జుడీషియరీని ‘ప్రభావితం’ చేయడానికి చేసిన ప్రయత్నమేనని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది. ‘డరో మత్’ (భయపడబోం) అని ఈ పార్టీ .. హిందీలో తన ట్విట్టర్ లో పేర్కొంది. మోడీ ప్రభుత్వం భయపడిపోతోందని, గిలగిలా కొట్టుకుంటోందని ఎద్దేవా చేసింది.
సూరత్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము పైకోర్టుకెక్కుతామని, అప్పీలు చేస్తామని పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు. మోడీ సర్కార్ పిరికిదని, అదానీ అంశంపై జేపీసీ వేయాలని తమతో సహా విపక్షాలు డిమాండ్ చేస్తూ వారి తప్పిదాలను బయటపెడుతున్న కారణంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు.
ఈ ప్రభుత్వం రాజకీయంగా దివాళా తీసిందని, వ్యక్తులు చేసే వ్యాఖ్యలపై ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసి గొలుపుతూ వారిపై కేసులు పెడుతోందని ఖర్గే అన్నారు. ఇక ఛత్తీస్ గఢ్, రాజస్తాన్ సీఎంలు భూపేష్ బాగేల్, అశోక్ గెహ్లాట్ ..తమ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్షపై తీవ్రంగా స్పందించారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ముందునుంచీ చెబుతూనే ఉన్నామని, న్యాయవ్యవస్థపై మోడీ సర్కార్ ఒత్తిడి తెస్తోందని వారు ఆరోపించారు. రాహుల్ గాంధీ చాలా ధైర్యస్థులని, ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆయన ఢీకొట్టగలరని వారన్నారు. సూరత్ కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశాలను కాంగ్రెస్ లీగల్ టీమ్ పరిశీలిస్తోంది.