సింగరేణిపై కేంద్రం పన్నిన కుట్రను భగ్నం చేస్తామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మండిపడ్డారు. సింగరేణిని కుట్రపూరితంగా ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం కుట్రను త్వరలోనే భగ్నం చేస్తామని, అవసరమైతే సింగరేణి కార్మికులతో పాటు రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణిని కాపాడుకునేందుకు ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్దమని కేటీఆర్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో మాట్లడిన ఆయన.. తెలంగాణ ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. బయ్యారం ఉక్కుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్మీ జోన్ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం.. కేంద్రానికి ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా స్పందించడం లేదని విమర్శించారు.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్ పేట్ వరకు స్కైవే నిర్మాణ కోసం ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయని.. కాని కేంద్రం దీనికి అనమతించడం లేదని చెప్పారు. ఇక మతపరమైన అడ్డంకులు ఉన్న రోడ్ల నిర్మాణం కోసం కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉందని కేటీఆర్ వివరించారు.