రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సమావేశాలకు అమిత్ షా హాజరై మాట్లాడారు.
కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనే కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నాడని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తాము మద్దతిచ్చామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేతుల్లో ఉందన్నారు. భారత తొలి హోం శాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో భారత్ లో భాగం అయి ఉండేది కాదన్నారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని ఆయన తెలిపారు. ఓవైసీ అంటే భయంతోనే విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ వ్యతిరేకించారని ఆయన ఆరోపించారు. ఎనిమిదేండ్లలో ఒక్క సారైనా సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లారా? అని ప్రశ్నించారు.
సచివాలయానికి వెళ్లే ప్రభుత్వం పడిపోతుందని తాంత్రికుడు చెప్పాడని, అందుకే సచివాలయానికి కేసీఆర్ వెళ్లడం లేదని చెప్పారు. రాబోయే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం తమకే దక్కుతుందన్నారు. దేశం మొత్తం పురోగమనంలో ఉంటే తెలంగాణ మాత్రం తిరోగమనంలో ఉందన్నారు.
రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతామన్నారు. టీఆర్ఎస్ నెరవేర్చని హామీలన్నింటినీ బీజేపీ నెరవేరుస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీయే నెరవేరుస్తుందని భరోసానిచ్చారు. సెప్టెంబరు 17న రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.