తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న కొత్త పంబన్ బ్రిడ్జి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వంతెన నిర్మాణ పనులు సాగుతున్నాయని, ఈ డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక చేశామని అధికారులు వెల్లడించారు. దాదాపు 100 ఏళ్ల కిందట నిర్మించిన పురాతన వంతెన ఇప్పటికీ అందుబాటులో ఉందని తెలిపారు.
ఆ వంతెన స్థానంలో మరింత అధునాతనంగా, సాంకేతికంగా దృఢంగా ఉండేందుకు కొత్త నిర్మాణాన్ని చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నిర్మాణానికి దాదాపు రూ.560కోట్లు ఖర్చు అవుతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వంతెనపై నుండి రైళ్లు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటే.. కొత్త నిర్మిస్తున్న వంతెనపై గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా నిర్మాణాలు చేపడుతున్నట్టు అధికారులు స్పష్టం.
రామేశ్వరం, ధనుష్కోడికి ఆధ్యాత్మిక యాత్రను సందర్శించాలనే భక్తులకు, యాత్రికులకు కొత్త వంతెన ఒక వరంలాం మారనుందంటున్నారు. పాత వంతెన సింగిల్ లైన్, నాన్ ఎలక్ట్రిఫైడ్ విభాగం కాగా.. కొత్తది డబుల్ లైన్, ఎలక్ట్రిఫైడ్ రైల్వే ట్రాక్ ను కలిగి ఉంటుందని వెల్లడించారు. పాత వంతెనపై సరుకు రవాణా రైళ్లను నిషేధించామని తెలిపారు. అయితే.. వాటిని కొత్త వంతెనపైకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇకపోతే.. కొత్త వంతెన గత ఏడాది సెప్టెంబరులోనే ప్రారంభించాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా అది ఆలస్యం అయిందని చెప్పారు. ఈ ఆల్ట్రా మోడ్రన్ డ్యూయల్ ట్రాక్ బ్రిడ్జి భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా అవతరించనున్నట్టు అధికారులు తెలిపారు.