ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మట్లాడారు. ఏపీలో రాజకీయ పార్టీలు రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాబోయే రోజుల్లో వడ్డీలు కట్టేందుకు అవసరమైన అభివృద్ధి కూడా ఏపీలో జరగడం లేదని తెలిపారు. దీని గురించి ఆలోచించకుండా ప్రతిపక్షాల గొంతును నొక్కేయాలనుకోవడం సరికాదని అన్నారు.
మీరు ప్రతిపక్షాలను ఎంతగా అణచివేయాలనుకుంటే అంతకంటే ఎక్కువగా ప్రజలు తిరగబడతారని అన్నారు. రోడ్లపై యాక్సిడెంట్లు జరిగి మరణాలు సంభవిస్తే.. రోడ్లపై జనాలను తిరగకుండా చేస్తామా? అని సీఎం రమేష్ ఎద్దేవా చేశారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని.. దాన్ని విస్మరించి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మీడియా ద్వారా తెలియనీయకుండా చేయాలనే ఉద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని దుయ్యబట్టారు.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కర్నూలుకు వస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుందని, సభ పెడుతుందని దురుద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందన్నారు. తమ పార్టీ కార్యక్రమాలకు మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఫైర్ అయ్యారు. సభలు పెట్టకూడదనే జీవోను వెంటనే రద్దు చేసి, మీ తప్పిదాలను ఎలా సరిదిద్దుకోవాలో హితవు పలికారు సీఎం రమేష్.
సభల్లో దురదృష్టకర ఘటనలు జరిగితే ఎంక్వైరీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు. అంతేకాని ఇలా ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరని పని అన్నారు. గత ప్రభుత్వం ఇదే విధంగా ఆలోచించి ఉంటే జగన్ పాదయాత్ర కొనసాగేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారని.. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని దించేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారన్నారు సీఎం రమేష్.