2024 ఎన్నికల్లో తాము ఏ ఇతర పార్టీలతోను పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి,బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రజల మద్దతుతోనే ఎన్నికలను ఎదుర్కొంటామని ఆమె చెప్పారు. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆమె ఆరోపించారు. తమను బీజేపీ వ్యతిరేక పార్టీలుగా సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఎలా చెప్పుకుంటాయని ప్రశ్నించిన ఆమె.. ఇవన్నీ అపవిత్ర పొత్తులని ఆరోపించారు.
బెంగాల్ లోని సార్దిగీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో పాలక టీఎంసీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ.. ఇలా మూడు పార్టీలూ మతతత్వ పోకడలను అడ్డుపెట్టుకున్నాయన్నారు.
బీజేపీ దీన్ని బాహాటంగా వాడుకోగా, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మరింత ఎక్కువగానే దీన్ని వాడుకున్నాయన్నారు. ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితే లేదన్నారు. ఈ కారణం వల్లే 2024 ఎన్నికల్లో తాము మరే ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
2019 లో విపక్ష కూటమికి ఆమె ఎంతగానో యత్నించారు. అయితే అది ఫలించలేదు. బీజేపీ మెల్లగా రాష్ట్రంలో తన స్థానాన్ని పదిలపరచుకోగలిగింది. 42 లోక్ సభ స్థానాలకు గాను 18 సీట్లను దక్కించుకుంది. అప్పటి నుంచి మమత.. ప్రధానంగా బీజేపీని తమ ప్రత్యర్థిగా భావిస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీని ఓడించాలనుకునేవాళ్ళు మా పార్టీని ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ మూడు శక్తులనూ ఎదుర్కోవడానికి మా ఒక్క పార్టీ చాలు అని ఆమె వ్యాఖ్యానించారు. 2021 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాగే చేశామని ఆమె గుర్తు చేశారు.