తమ నేత రాహుల్ గాంధీ ని లోక్ సభ సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటిస్తూ లోక్ సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేయడంతో కాంగ్రెస్ నేతలుభగ్గుమన్నారు. తాము రాజకీయంగా, లీగల్ గా దీన్ని సవాలు చేస్తామని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. అదానీ వివాదంపై జేపీసీ వేయాలని మేం డిమాండ్ చేయడంతో ప్రధాని మోడీ ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. ఇది బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. మరో సీనియర్ నేత శశిథరూర్.. కోర్టు తన ఉత్తర్వులను ప్రకటించిన వెంటనే ఇంత త్వరగా రాహుల్ పై చర్య తీసుకోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్క రోజులోనే ఇలా ఆయనపై అనర్హత వేటు వేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అని ట్వీట్ చేశారు. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే..దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ఆందోళనలో పాల్గొనాలన్నారు.నిజాలు మాట్లాడేవారిని బీజేపీ భరించజాలదని, కానీ తాము నిజాలు మాట్లాడుతునే ఉంటామని ఆయన అన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మోడీ ‘న్యూ ఇండియా’ లో బీజేపీ ప్రధాన టార్గెట్ విపక్ష నేతలయ్యారని ఆరోపించారు. క్రిమినల్ చరిత్ర గల బీజేపీ నాయకులు మోడీ కేబినెట్ లో కొనసాగుతుండగా విపక్ష నేతలపై మాత్రం ఇలా అనర్హత వేటు వేస్తున్నారని ఆమె అన్నారు.
మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఈ రోజు పూర్తిగా దిగజారిందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమకు విభేదాలు ఉన్నప్పటికీ పార్లమెంటులో విపక్షాలను చాలాసార్లు అణచివేశారని ఆప్ నేత, ఢిల్లీ సీఎం సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. ఇంకా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, పార్టీ నేత పృథ్వీ రాజ్ చవాన్ తదితరులు మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
రాహుల్ నివాసానికి సోనియా గాంధీ
రాహుల్ నివాసానికి పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేరుకున్నారు. రాహుల్ పై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేయడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆమె హుటాహుటిన వచ్చారు. రాహుల్ సోదరి, పార్టీ నేత ప్రియాంక గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని దోచుకున్న నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మెహుల్ చోక్సీ లను ఆ పార్టీ వదిలేసి ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని ఆమె అన్నారు. నీరవ్ మోడీ స్కామ్.. రూ. 1400 కోట్లు.. లలిత్ మోడీ స్కామ్..రూ. 425 కోట్లు.. మెహుల్ చోక్సీ స్కామ్ రూ. 13,500 కోట్లు అని ఆమె గుర్తు చేశారు. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. రాహుల్ మొత్తం ఓబీసీ సామాజిక వర్గాన్ని అంతా అవమానించారన్నారు. ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ అలాంటి వ్యాఖ్య చేయడాన్ని ఎవరూ హర్షించబోరన్నారు.