దేశంలో ఆయా ప్రాంతాలకు గల బ్రిటిష్, మొఘలుల కాలం నాటి పేర్లన్నీ మార్చేస్తామని బెంగాల్ లో విపక్ష బీజేపీ నేత సువెందు అధికారి తెలిపారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో గల మొఘల్ గార్డెన్ పేరును ‘అమృత్ ఉద్యాన్’ గా మార్చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. నాడు మొఘలులు అనేక హిందూ ఆలయాలను నాశనం చేశారని, తమ పేరిట ఆయా ప్రాంతాలకు పేర్లు పెట్టారని, కానీ ఇక ఇప్పుడు వాటిని గుర్తించి ఆ పేర్లన్నీ మార్చేస్తామని చెప్పారు.
బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోగా బ్రిటిష్, మొఘల్స్ స్మృతి చిహ్నాలుగా ఉన్న వాటి పేర్లను మార్చడం ఖాయమన్నారు. రాష్ట్రపతి భవన్ లో ఇప్పటివరకు ఉన్న మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 31 నుంచి ఈ గార్డెన్ ను ప్రజల సందర్శన కోసం ఓపెన్ చేయాలని కూడా తీర్మానించారు. ఇక్కడి అన్ని గార్డెన్ లనూ ఉమ్మడిగా ఇకపై అమృత్ ఉద్యాన్ గా వ్యవహరిస్తామని రాష్ట్రపతికి ప్రెస్ సెక్రటరీ అజయ్ సింగ్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే బెంగాల్ లో విపక్ష బీజేపీ నేత సువెందు అధికారి ఈ వ్యాఖ్య చేశారు. బెంగాల్ తో బాటు దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఈ పేర్ల సంస్కృతి కొత్త తరహాలో, భారతీయతను ప్రతిబింబించే విధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.