ఉక్రెయిన్ తో వార్ నేపథ్యంలో యూరప్ దేశాలకు తాము గ్యాస్ సరఫరాను నిలిపివేశామని, అయితే మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ లింక్ ద్వారా గ్యాస్ అందజేస్తామన్నారు. మాస్కోలో జరిగిన ఎనర్జీ ఫోరమ్ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన.. అసలు ఈ పైప్ లైన్ లింక్ ని ధ్వంసం చేయడం వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు. చౌకగా లభించే మా గ్యాస్.. యూరప్ దేశాలకు సరఫరా కాకుండా చూసేందుకు ఈ పైప్ లైన్స్ పై దాడి జరిగిందని, ఇది అంతర్జాతీయ టెర్రరిజం కిందికే వస్తుందని ఆయన అన్నారు. దీన్ని మొత్తం యూరప్ ఖండానికే ఇంధన సంబంధ సెక్యూరిటీకి ముప్పు తెచ్చే అంశంగా పరిగణించవచ్చునన్నారు.
చౌకయిన గ్యాస్ కాకుండా హెచ్చు ధరకు లభించే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ను ఈ దేశాలు దిగుమతి చేసుకునేలా అమెరికా బలవంత పెడుతోందని పుతిన్ తప్పు పట్టారు. రష్యాకు, యూరప్ దేశాలకు మధ్య సంబంధాలను దెబ్బ తీయాలనుకుంటున్నవారే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని నాశనం చేయడానికి పూనుకొన్నారని ఆయన అన్నారు. ఎలా చూసినా ఈ విద్రోహ చర్య వెనుక ఆ దేశం ఉందని నిప్పులు కక్కారు.
ఉక్రెయిన్ ద్వారా రష్యా యూరప్ కి గ్యాస్ ఇంకా పంపుతున్నప్పటికీ బాల్టిక్ పైప్ లైన్స్ పై పేలుళ్ల కారణంగా దీని సరఫరాలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా యూరప్ దేశాలు ఇంకా ఇంధన కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా గత ఫిబ్రవరి 24 న వార్ ప్రారంభించినప్పటి నుంచి జర్మనీ ఈ గ్యాస్ సరఫరాకు అడ్డుపుల్ల వేస్తూ వస్తోంది.
ఇదే సమయంలో పుతిన్ కూడా సాంకేతిక సమస్యల కారణంగా తాము దీన్ని సరఫరా చేయలేకపోతున్నామని పేర్కొన్నారు, అయితే ఉక్రెయిన్ కి తాము మద్దతునిస్తున్న కారణంగా తమలో చీలిక తెచ్చేందుకు రష్యా చేసిన ప్రయత్నమే ఇదని యూరప్ దేశాలు ఆరోపించాయి.
మొత్తానికి నార్డ్ స్ట్రీమ్ 2 లోని రెండు లింకులు సర్వీసుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయని, ఆపరేట్ చేయడానికి ఇవి సురక్షితంగానే ఉన్నట్టు నిర్ధారణ అయితే యూరప్ దేశాలకు తాము గ్యాస్ సరఫరా చేస్తామని పుతిన్ వివరించారు. టర్కీకి గ్యాస్ ఎగుమతులను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. కానీ తమను బ్లాక్ మెయిల్ చేయడానికో, ధరలపై ఓ పరిమితి విధించడానికో ఏ దేశమైనా ప్రయత్నిస్తే ఇప్పటి నుంచే ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నానని ఆయన చెప్పారు.