యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో 300 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులు విజయ కేతనం ఎగుర వేస్తారని తెలిపారు. ఈ మేరకు ఓ ఆంగ్లఛానెల్ తో సోమవారం ఆయన మాట్లాడారు.
‘ ఈ ఎన్నికలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు 80శాతానికి , ప్రతీ దాన్ని వ్యతిరేకిస్తూ నెగెటివ్ స్వభావం కలిగిన 20శాతం వ్యక్తులకు మధ్య పోరు. ఈ పోరులో మా విజయం ఖాయం. మొదటి దశ ఎన్నికల తీరును చూస్తే ఈ విషయం అర్థమవుతోంది” అన్నారు.
” ప్రధాని మోడీ నాయకత్వంలో, ప్రజల ఆశీస్సులతో యూపీలో బీజేపీ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్నికలను 80 వర్సెస్ 20 దిశలో మేము తీసుకున్నాము. బహుజన సమాజ్ వాదీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలత చెందాయి. మొదటి దశ ఎన్నికల తర్వాత ఆ పార్టీలు వెనకడుగు వేశాయి” తెలిపారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ‘ రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి సమస్యలూ లేవు. ప్రజాకర్షకంగా మేనిఫెస్టోను తయారు చేశాము. ఆర్థిక అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై నిజాయితీగా పని చేస్తున్నాము. రాష్ట్రంలో 80శాతం ప్రజలు మా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల సానుకూలంగా ఉన్నారు. మిగిలిన 20 శాతం నెగెటివ్ స్వభావం కలిగిన వారు. ఈ 80 వర్సెస్ 20లో మాదే విజయం ” అని స్పష్టం చేశారు.