రష్యాతో జరుగుతున్న యుద్ధంలో విజయ సాధనే తమ లక్ష్యమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. నూతన సంవత్సరంలో క్రిమియాతో సహా రష్యా ఆధీనంలోని తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోగలమన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా శనివారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన..గత ఏడాది ఫిబ్రవరి 24 న ఈ వార్ ప్రారంభమైందని, మొదట దీనిపై కొంత భయం కలిగినా ఆ తరువాత విజయం సాధించగలమన్న విశ్వాసం తలెత్తిందని అన్నారు. భయాందోళనను అధిగమించగలిగామని, తాము పారిపోలేదని, ఐక్యంగా ఉన్నామని చెప్పారు. సందేహాలను, నిరాశను, భయాన్ని పారదోలగలిగామన్నారు.
తమ దేశంలోని కీలక స్థావరాలపైనా, క్రిమియాలోని బ్రిడ్జ్ పైన, చివరికి మెటర్నిటీ ఆసుపత్రిపై కూడా రష్యా క్షిపణి దాడి ఘట్టాల వీడియో టేప్ క్లిప్పింగులను చూపుతూ ఉద్వేగంగా ఆయన ప్రసంగించారు. ఇంతకాలంగా కన్నీళ్లను దిగమింగుతూ వచ్చామని, ప్రార్థనలు చేస్తూ వచ్చామని చెప్పిన ఆయన.. ఈ ఏడాది ఉక్రెయిన్ ప్రపంచాన్నే మార్చివేసిందన్నారు. తమ దేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. తాము రష్యాకు లొంగిపోలేదన్నారు. ఎదురు దాడి చేయడానికే నిర్ణయించుకున్నామని, యూరోపియన్ యూనియన్, నాటోలో చేరనున్నామని జెలెన్స్కీ చెప్పారు.
2022 సంవత్సరాన్ని నష్ఠాలను ఎదుర్కొన్నఏడాదిగా వ్యవహరించడం సరికాదు అన్నారు. తామేదీ కోల్పోలేదన్నారు. ఉక్రేనియన్లు తమ ఇళ్లను కోల్పోలేదని, వాటిని ఉగ్రవాదులు నాశనం చేశారని పేర్కొన్నారు. మనలను ఎవరూ భయపెట్టలేరని, రానున్న సంవత్సరంలో విజయం మనదేనని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. కొత్త సంవత్సరం మన విశ్వాసాన్ని నిజం చేయగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ఇటీవల జెలెన్స్కీ అమెరికాకు వెళ్లి అధ్యక్షుడు జోబైడెన్ తో సమావేశమై వచ్చారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తమకు ఆ దేశం నుంచి మరింత ఆర్ధిక, ఆయుధ సాయం అవసరమని కోరారు. ఇందుకు బైడెన్ సైతం తక్షణమే సానుకూలంగా స్పందించారు.