ఢిల్లీలో తనతో సహజీవనం చేసిన శ్రద్దా వాకర్ ను హతమార్చడానికి, ఆమె శరీరాన్ని ముక్కలు చేయడానికి నిందితుడు అఫ్తాబ్ వాడిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని సోమవారం తీహార్ జైలుకు తరలించారు. ఇతడి ఇంటి నుంచి వారు 5 కత్తులను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఈ హత్యలో వీటిని అఫ్తాబ్ వాడాడా అన్న విషయాన్ని తేల్చుకోవడానికి వారీ చర్య తీసుకున్నారు. ఇవి అయిదారు అంగుళాల పొడవు ఉన్నట్టు తెలిసింది.
గత శుక్రవారం ఇతనికి మూడు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహించగా.. మిగిలిన వాటిని సోమవారం ఉదయం నిర్వహించారు. తీహార్ జైల్లో అఫ్తాబ్ ని ప్రత్యేక సెల్ లో ఉంచారు.
అతనిపై 24 గంటల నిఘా కూడా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంకా శ్రధ్ధా ధరించిన ఉంగరాన్ని ఇతగాడు మరో యువతికి గిఫ్ట్ గా ఇచ్చాడని తెలుసుకున్న ఖాకీలు ఆ ఉంగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇన్ని రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ తన చర్యకు ఏ మాత్రం పశ్చాత్తాపం ప్రకటించలేదని, మరో ఇద్దరు చిల్లర దొంగలను కూడా అతనితో బాటే లాకప్ లో ఉంచగా హాయిగా నిద్ర పోవడమే గాక వారితో ముచ్చటించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇతనికి మాదకద్రవ్యాలను సరఫరా చేసే ఫైజల్ మోమిన్ అనే వ్యక్తితో కూడా సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. ఫైజల్ ని సూరత్ లో పోలీసులు అరెస్టు చేశారు. అఫ్తాబ్ కు ఇక నార్కో టెస్ట్ నిర్వహించాల్సి ఉంది.