కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ నోరు జారారు. కోలార్ జిల్లాలో పర్యటించిన ఎంపీ ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల అవుతోంది. దీంతో ఆయనపై నెటిజన్లు, ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.
ఇంతకు ఏం జరిగిందంటే… కర్నాటకలోని కోలార్ జిల్లాలో ఎంపీ మునిస్వామి పర్యటించారు. అక్కడ ఓ షాపింగ్ మార్కెట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను పరిశీలిస్తున్న సమయంలో ఓ మహిళతో ఆయన మాట్లాడారు. ఆ మహిళ బొట్టు పెట్టుకోకపోవడంతో ఆమెను ఆయన ప్రశ్నించారు.
అక్కడ షాప్ పెట్టుకునేందుకు ఆమెకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ ఆయన అడిగారు. భర్త బతికే ఉండగా ఎందుకు బొట్టు పెట్టుకోలేదని, కామన్ సెన్స్ లేదా అంటూ ఆమెపై నోరు పారేసుకున్నారు. దీనిపై రాష్ట్రంలో దుమారం రేగుతోంది.
ఓ మహిళపై బీజేపీ ఎంపీ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మహిళలపై బీజేపీ నేతలు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. భారత్‌ను హిందుత్వ ఇరాన్‌లా బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.