ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
దేశంలో ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపు, నిరుద్యోగంతో పాటు పలు సమస్యలపై దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి.
ప్రజాసమస్యలను ఎత్తి చూపడమే తమ కర్తవ్యమని రాహుల్ గాంధీ ఈ సందర్బంగా అన్నారు. ప్రతిపక్షంగా ఆ విధులను నిర్వర్తిస్తున్నందుకు తమ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ఆయన పేర్కన్నారు.
అంతకుముందు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ,, రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ లో నిరసనలు తెలిపారు. అక్కడ నుంచి కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్రగా వెళ్లారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలను విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు వర్షంలోనూ రాహుల్ గాంధీ సహా కార్యకర్తలు నిరసనలు కొనసాగించారు. ఈ సందర్బంగా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్టేషన్ తరలించారు.