ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే మాడుపగిలేల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించే అవకాశముంది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట సహా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఆదివారం ఉపరితల ద్రోణి మహారాష్ట్రలోని మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించింది. దీంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాలు మేఘావృతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.
సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దాంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి దిశగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని గంటకు 06-10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపారు అధికారులు.
ఇక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39 నుండి 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ విభాగం పేర్కొంది. మరోవైపు ఈసారి ఎండలు గత సంవత్సరం కంటే తొందరగా మొదలయ్యాయి. గత వారం రోజులుగా తన ప్రతాపాన్ని చూపిన బాణుడు.. ఆదివారం మాత్రం కాస్త కనికరించాడు. అయితే, ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో భానుడి ప్రతాపం తగ్గే అవకాశాలు ఉన్నాయి.