మార్చి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో చెప్పి.. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించింది.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజన్ ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు కేరళను తాకుతాయని వెల్లడించింది. అలాగే.. ఈ ఏడాది వర్షపాతం కూడా సాధారణ స్థాయిలోనే ఉంటుందని అంచనా వేసింది. వర్షాల దీర్ఘకాల సగటు(ఎల్‌పీఏ) 96 నుంచి 104 శాతం మేర ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
రుతుపవనాల ప్రారంభం తర్వాత.. ఉత్తర, మధ్య భారత్ లోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రకటించింది. అలాగే, ఈశాన్య, వాయువ్య, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నాయి. అప్పుడు కూడా సాధారణ వర్షపాతమే నమోదైంది. అయితే.. సాధారణ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి.