ఈసారి వేసవికాలం ప్రారంభంలోనే భానుడు నిప్పులు చేరుగుతున్నాడు. ఆయన ఉగ్రరూపానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వచ్చే మూడు నెలల పాటు ఉష్ణోగ్రతలు మరింత తారాస్థాయికి చేరనున్నాయి. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ షాకింగ్ వివరాలు వెల్లడించింది. గత 122 ఏళ్లలో ఈ మార్చి నెలలో అత్యంత ఎక్కుడ ఉష్ణోగ్రతలు నమోద అయ్యాయి తెలిపింది.
అయితే, 1901 నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఐదో ఏడాదిగా 2021 నిలిచిందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) గత ఏడాది తెలిపింది. ఈసారి అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వివరించింది. రికార్డులను బద్దలు చేసే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చిలో నమోదైనట్టు ఐఎండీ ప్రకటించింది. 1901 తర్వాత ఇంతటి వేడి వాతావరణం నమోదు కావడం ఇదే మొదటి సారి అని పేర్కొంది. 2022 మార్చి నెలలో సగటు ఉష్ణోగ్రతలు 33.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
ఇక “1901 నుంచి నమోదైన ఉష్ణోగ్రతలో పోలిస్తే 2016, 2009, 2017, 2010 తర్వాత 2021లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో సాధారణం కన్నా 0.710 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. 2009లో 0.550 డిగ్రీల సెల్సియస్, 2017లో 0.541 డిగ్రీల సెల్సియస్, 2010లో 0.539 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉన్నాయి” అని గత ఏడాది ఐఎండీ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో సగటు పగటి ఉష్ణోగ్రత గత రికార్డులన్నింటినీ అధిగమించింది.
ఈ ఏడాది పొడి వాతావరణం ఎక్కువ రోజుల పాటు ఉండడమే వేడి పెరగడానికి కారణంగా తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి 6 మధ్య తీవ్ర వడగాలుల రిస్క్ ఉంటుందని అంచనా వేసింది. అందుకనే మధ్యాహ్న సమయంలో అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ ఇప్పటికే సూచించడం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అందుకు కారణం నగరాల్లో చోటుచేసుకుంటున్న మార్పులేని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది ఎండలు మార్చి నుంచి ఠారెత్తిస్తున్నాయి. వాస్తవానికి ఈ వేసవి సీజన్ కూల్‌గా ఉంటుందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాలు వేయగా.. అవి బోల్తా కొట్టాయి. ఐఎండీ అంచనాలకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలాను తీసుకోవాలని చెప్పారు. పండ్ల రసాలు, శీతల పానీయాలు తీసుకోవాలని తెలిపారు.