రాబోయే 5 రోజులు దేశంలో ఒక మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాను వాతావరణాలు ఇందుకు కారణాలని విశ్లేషిస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు వర్షాల ధాటికి తడిసి ముద్దవుతాయని అంచనా. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కొంకణ్, ఉత్తరాఖండ్, గోవా, ఛత్తీస్ గఢ్, బీహార్, ఒడిశా, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో వరుణుడు విజృంభించే అవకాశం ఉంది. మంగళవారం, ఛత్తీస్ గఢ్, విదర్భలో భారీ వర్షాలు కురిశాయి.
ఈ నెల 14 నుంచి 17 వరకు ఉత్తరాఖండ్ లో, 15 వరకు తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో, 15 నుంచి 17 వరకు యూపీలో వర్షాలుకురియనున్నాయి. రేపు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనుచిరు జల్లుల నుంచి ఒక మోస్తరుగా..లేదా భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీ.లో . శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో అప్పుడే తీవ్ర స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణాలో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడు లోని ఘాట్ ప్రాంతాల్లో కూడా బుధవారం భారీ వర్షపాతం నమోదు కావచ్చు. దక్షిణ మహారాష్ట్ర, గోవా తీరాల నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తుపాను వాతావరణం ఉందని, బంగాళఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారవచ్చునని అధికారులు వెల్లడించారు.