ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభం నుండే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపానికి భయపడి ప్రజలు కాలు బయటపెట్టాలంటే జంకుతున్నారు. అయితే తెలంగాణపై ఉపరితల ద్రోణి ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ, రైతులకు ఆపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. కళ్లముందే నీటి పాలైంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతన్న కన్నీరు పెడుతున్నాడు.
అయితే, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావం ఉండటంతో మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ముఖ్యంగా ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.