హుజూరాబాద్ ఎన్నిక వేళ కేసీఆర్ తెచ్చిన దళిత బంధు.. ఆయనకు సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తుండగా… కులాలవారీగా పథకాల డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. తాజాగా పద్మశాలి బంధు కావాలంటూ నిరాహార దీక్షకు దిగారు నేతన్నలు.
వరంగల్ అర్బన్ కమలాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి అధ్యక్షుడు తుమ్మ శోభన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగారు నేతన్నలు. దళిత బంధు పథకం మాదిరిగా పద్మశాలి బంధును అమలు చేయాలనే డిమాండ్ తో ఈ దీక్ష చేపట్టారు. దళితుల కోసం దళిత బంధు ప్రవేశ పెట్టినప్పుడు తమ కోసం పద్మశాలి బంధు ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పద్మశాలీలకు చాలా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు శోభన్. వెంటనే తమ వర్గానికి కూడా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.