పలు వెబ్ సిరీస్‌ల్లో కీలక పాత్రలు పోషించిన ఓ నటిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు చేతిని కొరికి, అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించినందుకు గాను సదరు నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి చందన్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కర్ణాటకకు చెందిన యువతి(28) నటిగా జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ముంబైలోని అంధేరిలో ఆమె నివాసం ఉంటోంది. ఆమె తన వ్యక్తిగత పని నిమిత్తం పూణెకి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ స్టే చేయడానికి ఓ హోటల్ లో రూం బుక్ చేసుకుంది. హోటల్ లో ఉన్న సదుపాయాల పట్ల ఆమెకు అసంతృప్తి కలిగింది.
దీంతో తాను చెల్లించిన డబ్బును తిరిగి తనకు వాపస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. కొద్ది సేపటికి ఆమె సహనం కోల్పోయింది. దీంతో హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో సదరు నటిపై హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న దామిని స్క్వాడ్ మహిళా పోలీసు అధికారి హోటల్ కు చేరుకున్నారు. అక్కడ ఆమెను శాంతింపచేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆమె మరింత రెచ్చిపోయింది. అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పర్వీన్ షేక్ ను పలుమార్లు ఆమె నోటితో కొరికింది. ఆ తర్వాత అతనిపై దాడికి ప్రయత్నించింది. దీంతో సదరు నటిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.