శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలనే అంటే ఇదే కావచ్చు. మారుతున్న కాలంతో పాటు మనుషుల క్రియేటివిటీ కూడా మారుతోంది అనడానికి ఇదొక ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. ఓ పెళ్లి బృందం అచ్చంగా దీనినే ఫాలో అయింది. చాలా క్రియేటివ్ గా మండే ఎండల నుంచి తమను తాము రక్షించుకుంటూ బరాత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో అందరిని ఆకట్టుకుంటుంది.
అన్ని రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటిస్తున్నారు. ఎండ వేడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో అన్ని ప్రాంతాల ప్రజల్లో పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బరాత్ లేకుండా పెళ్లిళ్లే జరగడంలేదు. మరీ ఈ మండే ఎండల్లో, కాలుతున్న రోడ్లపై బరాత్ నిర్వహించాలంటే కష్టంగా ఉంటోందని.. సూరత్‌లో ఓ పెళ్లి బృందం ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. కదిలే పందిరి కింద బరాత్ తీశారు.
పెళ్లి కొడుకు గుర్రంపై ఉండగా.. చుట్టాలు, స్నేహితులు కదిలే పందిరి కింద డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఎంజాయ్ చేస్తున్నవారికి ఎండ తగలకుండా ఆ పందిరిని నాలుగు మూలల నలుగురు వ్యక్తులు ముందుకు జరుపుతూ.. వారు ముందుకు కదిలారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు భారతీయుల క్రియేటివిటీపై కామెంట్లు పెడుతున్నారు.