పెళ్ళిసందడి శుభలేఖలతోనే మొదలవుతుంది. అక్కడి నుంచే పెళ్ళి పనులు ఊపందుకుంటాయి. పిలుపులు సరిగ్గా లేకపోతే చుట్టాలతోనే పేచీలు మొదలవుతాయి. నోటి మాటకన్నా ఓ అందమైన శుభలేఖ ద్వారా పెళ్ళి కబురు చెబితే సగం సమస్య తీరిపోవడంతోపాటు, శుభసూచనగా కూడా ఉంటుందనేది పెద్దల మాట.
అందుకే, ఆహ్వాన పత్రికను చాలా జాగ్రత్తగా రాయిస్తుంటారు. అయితే.. రానురాను శుభలేఖ రకరకాల మార్పులకు గురవుతూ వచ్చింది. కొంతమంది జౌత్సాహిక వధూవరులు తమ పెళ్ళి శుభలేఖ చాలా స్పెషల్ గా ఉండాలని కోరుకోవడం సర్వసాధారణమై పోయింది.
శుభలేఖకి సృజనాత్మకత యాడ్ చేసి వింత వింత వివాహ ఆహ్వానాలను సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అలాంటి ఓ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఏడిద వెంకటేష్.. తన చిన్న కుమార్తె పెళ్లికి రెండు వేల రూపాయల నోటు తరహాలో శుభలేఖ అచ్చు వేయించారు. చిన్న పరిమాణంలోనే.. 2 వేల రూపాయల నోటును పోలినట్లుగా తయారు చేయించిన ఈ పెళ్లి కార్డు అందరినీ ఆకట్టుకుంటోంది.
కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్ అనే పదం చేర్చారు. వివాహ బంధంతో ఒక్కటవుతున్నాం.. చివరి శ్వాసవరకూ కలసి ఉంటామంటూ కార్డుపై ప్రస్తావించారు. అలాగే నోటుకు మరోవైపు వివాహానికి సంబంధించి వివరాలు ముద్రించారు.